​రేణిగుంట, అక్టోబర్ 27:

తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఎంపీటీసీ ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా స్పష్టమైంది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రవిచంద్ర, రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్‌ఓ) ఆదినారాయణల పర్యవేక్షణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున పలు సెగ్మెంట్లలో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడంతో రేణిగుంట మండలంలోని మొత్తం 21 ఎంపీటీసీ సెగ్మెంట్లలో ఏకంగా 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఆఆర్‌ఓ ఆదినారాయణ వెల్లడించారు.

​ఈ క్రమంలో అత్తూరు, ఎలమండ్యం, గాజులమండ్యం-1, గాజులమండ్యం-2, జి.పాలెం, కరకంబాడి-1, కరకంబాడి-2, కరకంబాడి-3, కృష్ణాపురం, మాముండూరు, ఆర్.మల్లవరం, రేణిగుంట-1, రేణిగుంట-2, రేణిగుంట-4, రేణిగుంట-6, తూకివాకం మరియు వెంకటాపురం పంచాయతీ ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ధ్రువీకరించారు.

​ధ్రువీకరణ పత్రాల అందజేత:

ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఆఆర్‌ఓ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. రేణిగుంట మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, జి.పాలెం టీడీపీ సీనియర్ నాయకులు అప్పిరెడ్డి రాజశేఖర్, సుబ్రమణ్యం రెడ్డిల ఆధ్వర్యంలో ఈ పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు.

​మిగతా స్థానాల్లోనూ విజయం మనదే: మునిచంద్రారెడ్డి

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి మాట్లాడుతూ… మండలంలో 17 స్థానాలు ఏకగ్రీవం కావడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు తమను ఆశీర్వదించారని పేర్కొన్నారు. జెడ్పీటీసీ స్థానంతో పాటు ఎన్నికలు జరగనున్న మిగిలిన 4 ఎంపీటీసీ స్థానాలైన రేణిగుంట-3, రేణిగుంట-5, సురప్పకాశం, గుత్తివారిపల్లి-1 సెగ్మెంట్లలో కూడా తమ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రేణిగుంట మండలాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *