కలిగిరి, అక్టోబర్ 27, మన ధ్యాస ప్రతి తినిధి నాగరాజు.

కలిగిరి మండలంలోని వెలగపాడు ఎంపీటీసీ స్థానం టీడీపీ అభ్యర్థి ఎంపికపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది.ఈ స్థానం కోసం చిట్టిబోయిన సురేఖ, దేవనబోయిన సులోచనమ్మ అనే ఇద్దరు బలమైన మహిళా నేతలు పోటీ పడ్డారు. ఇద్దరికీ క్షేత్రస్థాయిలో గట్టి పట్టు ఉండటంతో టికెట్ సాధించేందుకు ఇరువర్గాల అనుచరులు సోషల్ మీడియా వేదికగా, పార్టీ అంతర్గత సమావేశాల్లో తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో వెలగపాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.స్థానిక సమీకరణాలను బేరీజు వేస్తూ ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేశారు. పార్టీలో ఎలాంటి అసమ్మతి రాకుండా, గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా ఇరువర్గాలతో చర్చలు జరిపారు.చివరకు నియోజకవర్గ నాయకత్వం సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటూ చిట్టిబోయిన సురేఖకు అధికారికంగా బీ-ఫాం అందజేసింది. పార్టీ పెద్దల చేతుల మీదుగా బీ-ఫాం అందుకోవడంతో సురేఖ వర్గంలో సంబరాలు మిన్నంటాయి.అధికారిక అభ్యర్థిగా ఖరారైన చిట్టిబోయిన సురేఖ మాట్లాడుతూ.. దేవనబోయిన సులోచనమ్మ, తాము ఇద్దరం టీడీపీ అభ్యర్థులమేనని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశంలో, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణుల మద్దతుతో వెలగపాడులో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తానని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *