అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలి – ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించాల జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ.

తిరుపతి, అక్టోబరు 21: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం లభించని, తగిన భద్రత లేక నామినేషన్లు సమర్పించలేకపోయిన అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ. బుధవారం ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు తిరుపతి కలెక్టరేట్ లోని మిని విసి హాల్ నుండి కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ, డి ఆర్ ఓ జి. నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సంబంధిత అధికారులను ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారంటూ అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, విశ్వసనీయ ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికలను తక్షణమే సమర్పించాలని సూచించారు. నామినేషన్ల దాఖలుకు అదనంగా ఒకటి లేదా రెండు రోజుల సమయం కల్పించే అవకాశం ఉంటుందని, ఈ అవకాశం అందరు అభ్యర్థులకు వర్తించదని, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని లేదా అవకాశం నిరాకరించారని అధికారికంగా ఫిర్యాదు చేసిన అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు. 19 పురపాలక సంఘాలకు సంబంధించి అందిన ఫిర్యాదులను పరిశీలించి, అర్హులైన అభ్యర్థుల విషయంలో వాస్తవాలను నిర్ధారించాలన్నారు. అభ్యర్థులు సమర్పించిన ఫిర్యాదుల్లోని అంశాలను సంబంధిత ఆధారాలతో ధ్రువీకరించాలని, నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎదురైన ఇబ్బందులు, జరిగిన ఘటనల వివరాలను సేకరించాలని సూచించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు , రిటర్నింగ్ అధికారులు , మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, నామినేషన్ కేంద్రాల నుంచి అవసరమైన సమాచారం, ఆధారాలను సేకరించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఈ నివేదికలను అదే రోజు ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుపై అధికారులకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే తెలియజేయాలని, అవసరమైన న్యాయ సలహా తీసుకుని తదుపరి మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతిని పరిశీలించిన అనంతరం మరింత స్పష్టమైన సూచనలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు తమ పరిధిలో పరిస్థితులను సమీక్షించి, అవసరమైన పోలీసు బలగాల మోహరింపునకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ముందస్తు అరెస్టులు, ఇతర నిరోధక చర్యలు చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా ఉండాలని, ఏ అభ్యర్థి పట్ల వివక్షకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అధికారులు సమర్పించే నివేదికలు, ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఏ పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు అదనంగా ఒకటి లేదా రెండు రోజుల సమయం కల్పించాలనే అంశంపై తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *