
* తుంబకుప్పంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
బంగారుపాళ్యం, అక్టోబరు 10 – మన ద్యాస(
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, పలమనేరు డీఎస్పీ డి. ప్రభాకర్ ఆధ్వర్యంలో బంగారుపాళ్యం మండలం తుంబకుప్పం గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాలు, వ్యక్తులు, వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు, గంజాయి వంటి నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, నిల్వకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఇతర సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించారు.వాహనాలకు సంబంధించి సరైన రికార్డులు చూపించని వారి మోటార్ సైకిళ్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామాల్లో నేరాలను అరికట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.వాహనదారులు నిబంధనలు పాటించాలి ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర అవసరమైన పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.గ్రామాల్లో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాలను నియంత్రించి, గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పవచ్చని పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగవరం పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి, బంగారుపాళ్యం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సీఐ రామభూపాల్, బంగారుపాళ్యం ఎస్‌ఐ టి. ప్రసాద్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.