శభాష్ రేణిగుంట పోలీస్! రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో వేగవంతమైన శోధన…
రేణిగుంట: అక్టోబర్ 4
రేణిగుంట పట్టణంలో తీవ్ర కలకలం రేపిన బాలుర అదృశ్యం ఉదంతం సుఖాంతమైంది. రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ప్రత్యేక చొరవ, పోలీసుల అప్రమత్తత మరియు క్షేత్రస్థాయిలో వేగవంతమైన విచారణ కారణంగా కేవలం ఒక్క రోజులోనే ఇద్దరు పిల్లల ఆచూకీ లభించింది.
రేణిగుంట బుగ్గ వీధికి చెందిన జి. పాండురంగ (12) మరియు పి. గణేష్ రెడ్డి (15) అనే ఇద్దరు బాలురు అక్టోబర్ 02, 2026న అదృశ్యమయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన వెంటనే సీఐ జయచంద్ర ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వారి మార్గదర్శకత్వంలో రేణిగుంట పోలీసులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రత్యేక బృందాల సహకారంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
మహబూబ్‌నగర్‌లో లభించిన ఆచూకీ…
సీఐ జయచంద్ర నేతృత్వంలో సాగిన దర్యాప్తులో ముఖ్యమైన ఆధారం లభించింది. తప్పిపోయిన ఈ ఇద్దరు బాలుర ఆచూకీ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు రాత్రి 11:00 గంటల సమయంలో గుర్తించారు. సమాచారం అందిన వెంటనే రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆదేశాల మేరకు రేణిగుంట పోలీస్ సిబ్బంది రాత్రికి రాత్రే అక్కడికి బయలుదేరి వెళ్లి, బాలురిని సురక్షితంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని క్షేమంగా రేణిగుంటకు తీసుకువస్తున్నారు.
కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, రాత్రికి రాత్రే పొరుగు రాష్ట్రానికి వెళ్లి పిల్లలను సురక్షితంగా తీసుకువచ్చిన సీఐ జయచంద్ర మరియు రేణిగుంట పోలీస్ సిబ్బంది చొరవను స్థానికులు, బాలుర తల్లిదండ్రులు ఎంతగానో కొనియాడుతున్నారు. సమర్థవంతంగా పనిచేసి పిల్లల ఆచూకీ కనిపెట్టిన సీఐ జయచంద్ర టీమ్‌కు “శభాష్ రేణిగుంట పోలీస్” అంటూ సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

