అమరావతి సెప్టెంబర్ 03.
రాష్ట్రంలో పాలనను మరింత పారదర్శకంగా, ప్రజానుకూలంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పౌరులు అందజేసే ఫిర్యాదుల పరిష్కారంపై వారి అనుభవాలు, సంతృప్తి స్థాయిలను నేరుగా తెలుసుకునేందుకు ‘సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూ ఆర్ కోడ్’ (సిటిజెన్ ఫీడబాక్ క్యూ ఆర్ కోడ్ ) ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విధానం ద్వారా ప్రజలు అందించే అభిప్రాయాల ఆధారంగా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం మరియు సమర్థవంతం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ ) నిర్ణయించింది.
క్యూఆర్ కోడ్ సేవలు సఫలీకృతం కావడానికి, వీలైనంత ఎక్కువ మంది పౌరులకు చేరేలా చూడటానికి ముఖ్య ఫిర్యాదుల అధికారి (చీఫ్ గ్రీవాన్స్ ఆఫీసర్ – సి జి ఓ ) ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. సోషల్ మీడియా వేదికలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ క్యూఆర్ కోడ్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లు, మండల పరిషత్, పురపాలక సంఘాలు మరియు సంబంధిత అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పౌరులకు స్పష్టంగా కనిపించే అనువైన ప్రాంతాల్లో ఈ క్యూ ఆర్ కోడ్ బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదుదారులు తమ అభిప్రాయాలను సులభంగా నమోదు చేసేలా సిబ్బంది తగిన అవగాహన కల్పించాలని కోరారు.
ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంతవరకు సంతృప్తికరంగా అందుతున్నాయో తెలుసుకోవడంలో పౌరుల స్పందన అత్యంత కీలకమని సీజీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలందరూ తమ పూర్తి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. పౌరులు తమ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్‌ను నమోదు చేయడం ద్వారా పాలనా వ్యవస్థలో మరింత జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపునిచ్చింది.
