మన ధ్యాస,నిజాంసాగర్ ,జుక్కల్ ,02 సెప్టెంబర్ ,మొహమ్మద్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా వానాకాలం పంటల సాగుకు నీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి,జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు తో కలిసి సంజీవు పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..
2026 వర్షాకాలంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల్లో రాష్ట్రంలో సుమారు 36 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, భగవంతుని దయతో నిజాంసాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరిగాయి.ప్రస్తుతం నిజాంసాగర్‌లో సుమారు 13.3 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నీటి నిల్వలపై ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ కింద ఉన్న ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు నీటిని సద్వినియోగంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు.చీఫ్ ఇంజనీర్ల కమిటీ,ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నుంచి వర్షాకాల పంటలకు నీటిని విడుదల చేస్తున్న మొదటి ప్రాజెక్టుగా నిజాంసాగర్ నిలుస్తోంది అని అన్నారు.నిజాంసాగర్ కింద సుమారు 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించాం.రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొదట 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి,అనంతరం పరిస్థితిని బట్టి వారం లేదా పది రోజులు విరామం ఇచ్చి, మళ్లీ నీటిని విడుదల చేస్తూ చివరి పంట వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నాలుగు రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోనూ వర్షపాతం లోటు ఉండే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి. అందువల్ల అందుబాటులో ఉన్న నీటిని ప్రతి రైతు ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఆయకట్టు రైతులు ఎక్కువ నీటిని వినియోగిస్తే కింది ఆయకట్టు రైతులకు నీరు అందదు. అప్పుడు కాలువల్లో ఎక్కువ క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వస్తుంది. దీంతో నిజాంసాగర్ నీటి నిల్వలు త్వరగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.కాబట్టి పై ఆయకట్టు,కింది ఆయకట్టు రైతులు పరస్పరం సహకరించుకుంటూ నీటిని పొదుపుగా వాడుకోవాలి. అందరూ సమన్వయంతో వ్యవహరిస్తే అందరి పంటలను కాపాడుకోవచ్చు.
బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు నిజాంసాగర్ నీటిపై ఆధారపడిన ఆయకట్టు ప్రాంతాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతుల పంటలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైనంత మేరకు నీటి సరఫరాను కొనసాగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుని, అధికారులు–రైతులు సమన్వయంతో పనిచేస్తే ఈ వర్షాకాల పంటలను కాపాడుకోవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి,సీఈ శ్రీదేవి,
కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్‌కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజా పండరి, రవీందర్‌రెడ్డి, ఎస్‌ఈ దక్షిణామూర్తి, డిప్యూటీ ఈఈ కిన్యా నాయక్, సర్పంచ్ బోయిని హరికుమార్,నీటిపారుదల శాఖ ఏఈలుసాకేత్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
