తిరుపతిలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్-అఫీషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఆరోగ్యం, సాధికారత, భవిష్యత్తు పరిరక్షణ కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని తెలిపారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉంటూ తమ ప్రతిభను విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు.

“యువతే దేశానికి బలం.. వారి భవిష్యత్తును డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం మనందరి బాధ్యత” అని పేర్కొంటూ, తిరుపతి ప్రాంతాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కుటుంబాలు, విద్యాసంస్థలు, పోలీసులు, ప్రజలు సమష్టిగా పనిచేసినప్పుడే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, యువతతో “డ్రగ్స్‌కు దూరంగా ఉంటాం.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుతాం” అంటూ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి అనిత , పోలీసు అధికారులు, ఏఎస్ఎఫ్ నాయకులు, కూటమి పార్టీల నేతలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *