రేణిగుంట ఆగష్టు 15.

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, రూరల్ పరిధిలోని గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో నిందితుడిగా ఉన్న కిరణ్ కుమార్ రాయల్ ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని ఎస్‌ఐ ఎస్. హరీష ఒక ప్రకటనలో కోరారు.

​ఈ ఘటన వివరాలను ఎస్‌ఐ వివరిస్తూ— 2017 డిసెంబర్ 14న సాయంత్రం రేణిగుంట మండలం, కుర్రకాల్వ పద్మనగర్‌కు చెందిన కిరణ్ కుమార్ రాయల్‌తో పాటు మరో ఐదుగురు నిందితులు అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు చెందిన దుకాణంలో మద్యం సేవించేందుకు వెళ్లి ప్లాస్టిక్ గ్లాసులు అడిగారు. దుకాణ యజమాని గ్లాసులు లేవని చెప్పడంతో, అదే రోజు రాత్రి నిందితులందరూ కలిసి దుకాణం తాళాలు పగలగొట్టి అక్రమంగా లోపలికి ప్రవేశించి వస్తువులను తగులబెట్టారని తెలిపారు.

​ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయగా, అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, మొదటి నిందితుడైన కిరణ్ కుమార్ రాయల్ కోర్టు వాయిదాలకు సరిగా హాజరు కావడం లేదని ఎస్‌ఐ పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 7వ తేదీన నిందితుడి ఇంటి వద్ద వీఆర్వో ఆధ్వర్యంలో దండోరా వేయించినప్పటికీ అతను కోర్టుకు హాజరు కాలేదని తెలిపారు.

​ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన నాలుగో అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో నిందితుడు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. నిందితుడు కోర్టుకు హాజరు కాకపోయినా లేదా ఉత్తర్వులను ఉల్లంఘించినా తదుపరి చట్టపరమైన చర్యలకు అతడే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కిరణ్ కుమార్ రాయల్ ఆచూకీ తెలిసిన ప్రజలు గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ హరీష తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *