​ఆశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి…
​ప్రభుత్వం మార్గదర్శక, పర్యవేక్షణ పాత్ర మాత్రమే పోషిస్తుంది…
​శతాబ్ది ఉత్సవాలను వాయిదా వేసి, అందరి సమ్మతితో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు….
జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.
​తిరుపతి: తిరుపతి జిల్లాలో ఆధ్యాత్మిక, విద్యా, సామాజిక రంగాల్లో విశిష్ట చరిత్ర కలిగిన ఏర్పేడు వ్యాసాశ్రమానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫెరెన్స్ హాల్‌లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆశ్రమ నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ, శతాబ్ది ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యాసాశ్రమాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోదని, దేవాదాయ శాఖ చట్టం పరిధిలో కేవలం పర్యవేక్షణ, మార్గదర్శకత్వం మాత్రమే వహిస్తుందన్నారు. ఆశ్రమ అభివృద్ధి కోసం పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు, భక్తుల భాగస్వామ్యంతో 11 లేదా 21 మంది సభ్యులతో కూడిన సమర్థవంతమైన కమిటీ ఏర్పాటుపై ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఆశ్రమ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతో పాటు ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసం ఆడిటింగ్ చేపడతామన్నారు. అన్ని వర్గాలతో చర్చించి, సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించిన అనంతరమే శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, ప్రక్రియ ముగిసేవరకు అందరూ సంయమనం పాటించాలని కోరారు.
​సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యాసాశ్రమ నిర్వహణలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని, సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం మరియు పీఠాధిపతుల మధ్య సమన్వయకర్తగా పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి కోలా ఆనంద్ మాట్లాడుతూ, సద్గురు మలయాళస్వామి వారి ఆశయాలకు అనుగుణంగా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఆశ్రమ కార్యక్రమాలు శాంతియుతంగా జరిగేలా పోలీసు శాఖ నుంచి పూర్తి బందోబస్తు కల్పిస్తామని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. అలాగే, గతంలో ఉన్న బ్రహ్మవిద్యా పాఠశాల, గురుకుల వ్యవస్థలను పునఃప్రారంభించి ఆధ్యాత్మిక గ్రంథాల ముద్రణ చేపట్టాలని పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు సూచించారు. ఈ సమావేశంలో డిఆర్వో నరసింహులు, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *