– బెంగళూరు ‘నైజీరియన్’ నెట్‌వర్క్ గుట్టు రట్టు.

– డ్రగ్స్ ఎంతటి వారిదైనా మూలాలను తవ్వితీస్తాం: రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర.

​రేణిగుంట ఆగష్టు 7. మత్తు పదార్థాల విక్రయాలపై తిరుపతి జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందించారు. మత్తు పదార్థాల నెట్‌వర్క్ ఎంత పెద్దదైనా “కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తాం” అని రేణిగుంట పోలీసులు హెచ్చరించారు. తిరుపతి ఎస్పీ ఆదేశాలు, డిఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో రేణిగుంట ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర, సబ్ ఇన్‌స్పెక్టర్ వై. శ్రీనివాసులు బృందం మెత్ మత్తు మందుల కేసులో నాలుగో నిందితుడు (ఎ-4) గొడుగు చింత వినోద్ కుమార్ (33, పూతలపట్టు) ను రేణిగుంట రమణ విలాస్ సర్కిల్ వద్ద అరెస్ట్ చేశారు. గతంలో పట్టుబడిన ఎ-1 తెల్ల గుణశేఖర్, ఎ-2 ఎస్. అశ్విన్ కుమార్, ఎ-3 పడమల రాహుల్ యాదవ్ ఇచ్చిన సమాచారంతో ఈ అరెస్ట్ జరిగింది. నిందితుడు బెంగళూరులో ద్విచక్ర వాహన టాక్సీ నడుపుతూ, వాట్సాప్ ద్వారా పరిచయమైన నైజీరియన్‌ వద్ద తక్కువ ధరకు డ్రగ్స్ కొని తిరుపతిలో గుణశేఖర్‌కు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని చట్టప్రకారం రిమాండ్‌కు పంపగా, ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బంది మురళి, రమేష్, రాజశేఖర్, శ్రీను, గౌరినాయుడు, బారుష, చలపతిలను ఎస్పీ గారు అభినందించి పారితోషికాలు అందజేశారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఇన్‌స్పెక్టర్ జయచంద్ర తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *