ఆశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి….

ప్రభుత్వం మార్గదర్శక, పర్యవేక్షణ పాత్ర మాత్రమే పోషిస్తుంది
శతాబ్ది ఉత్సవాలను వాయిదా వేసి, అందరి సమ్మతితో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు
జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.

తిరుపతి, ఆగష్టు 6: తిరుపతి జిల్లాలో ఆధ్యాత్మిక, విద్యా, సామాజిక రంగాల్లో విశిష్ట చరిత్ర కలిగిన ఏర్పేడు వ్యాసాశ్రమానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమగ్ర చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.గురువారం సాయంత్రం స్థానిక వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నందు ఏర్పేడు వ్యాసాశ్రమ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అభివృద్ధి, నిర్వహణ, విద్యా కార్యక్రమాల పునరుద్ధరణ, ఆశ్రమ ఆస్తుల పరిరక్షణ, పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేయడం తదితర అంశాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు, ఆశ్రమంతో అనుబంధం ఉన్న స్వామీజీలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. వ్యాసాశ్రమం వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక, విద్యా సంస్థ జిల్లాలో ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. గతంలో విద్య, ఆధ్యాత్మికత, సంస్కారం, సేవా కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యాసాశ్రమం కాలక్రమేణా ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోవడం బాధాకరమన్నారు. ఆశ్రమానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత వారందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యాసాశ్రమంతో అనుబంధం కలిగి, అక్కడ విద్యను అభ్యసించి ప్రస్తుతం వివిధ పీఠాలకు పీఠాధిపతులుగా ఉన్న స్వామీజీల అనుభవాలు, సూచనలు ఎంతో విలువైనవని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుత నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుని, అన్ని వర్గాలతో చర్చించి సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాసాశ్రమాన్ని ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని నిర్వహించాలనే ఉద్దేశం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఆశ్రమం స్వతంత్ర ఆధ్యాత్మిక సంస్థగా తన సంప్రదాయాలు, విధానాలను కొనసాగిస్తూ అభివృద్ధి చెందేలా చూడటమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అవసరమైన సందర్భాల్లో జిల్లా యంత్రాంగం నుంచి సహకారం అందిస్తామని, దేవాదాయ శాఖ చట్టం, సంబంధిత నిబంధనల పరిధిలో అవసరమైన మార్గదర్శకత్వం, పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని తెలిపారు. ఆశ్రమం నిర్వహణ, కార్యక్రమాల రూపకల్పన, అభివృద్ధి అంశాల్లో ఆశ్రమానికి అనుబంధంగా ఉన్న పీఠాధిపతులు, స్వామీజీలు, పూర్వ విద్యార్థులు, భక్తులు సమాలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమని సూచించారు.వ్యాసాశ్రమ అభివృద్ధి కోసం సమర్థవంతమైన కమిటీ లేదా ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కమిటీలో 11 మంది సభ్యులా, 21 మంది సభ్యులా అనే అంశంపై సంబంధిత పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు, భక్తులు సమాలోచన చేసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. కమిటీలో ఎవరు ఉండాలి, ఎలాంటి విధానాలతో నిర్వహించాలి, ఆశ్రమ సంప్రదాయాలు మరియు మూల సూత్రాలకు అనుగుణంగా ఏ విధమైన పరిపాలనా వ్యవస్థ ఉండాలి అనే అంశాలను సంబంధిత వర్గాలు సమగ్రంగా చర్చించి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో వచ్చిన ప్రతి సూచన, సలహాను జిల్లా దేవాదాయ శాఖ అధికారులు నమోదు చేసి, భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టమైన రికార్డు ఉండేలా సమావేశపు మినిట్స్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యాసాశ్రమానికి సంబంధించిన ఆస్తులు, భక్తులు అందించిన విరాళాలు, వారసత్వంగా వచ్చిన ఆస్తులు తదితరాలను పూర్తి పారదర్శకతతో పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆశ్రమ ఆస్తులు ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆశ్రమ ఆర్థిక వ్యవహారాలు, ఖాతాలు, ఆదాయ–వ్యయ వివరాలను నిబంధనల మేరకు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా అవసరమైన ఆడిటింగ్ చర్యలను చేపట్టాలని, దేవాదాయ శాఖ పరిధిలో అవసరమైన విచారణ చేపట్టేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు. వ్యాసాశ్రమం స్థాపకులు, పూర్వ పీఠాధిపతులు రూపొందించిన నియమ నిబంధనలు, ట్రస్ట్‌కు సంబంధించిన పత్రాలు, బైలాస్ తదితరాలను పరిశీలించి, చట్టపరమైన అంశాలను అధ్యయనం చేయాలని అధికారులు, సంబంధిత ప్రతినిధులకు సూచించారు.వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా, అందరి భాగస్వామ్యంతో నిర్వహించాలంటే తగిన సమయం, సమగ్ర ప్రణాళిక అవసరమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా ఆశ్రమానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి, అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన అనంతరం శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం సముచితమని పేర్కొన్నారు. పోలీసు శాఖకు సంబంధించిన బందోబస్తు, సెప్టెంబర్ నెలలో జరిగే ఇతర ప్రధాన కార్యక్రమాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని శతాబ్ది ఉత్సవాలను వాయిదా వేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని వర్గాల సమ్మతితో, ఎలాంటి విభేదాలకు తావులేకుండా, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం అవసరమని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశానికి హాజరు కాలేకపోయినందున, వారికి అధికారికంగా సమాచారం అందించి మరోసారి సమావేశానికి ఆహ్వానించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అన్ని పక్షాల వాదనలు, అభిప్రాయాలు తెలుసుకుని, ఎవరినీ పక్కన పెట్టకుండా సామరస్యపూర్వకంగా సమస్యకు పరిష్కారం కనుగొనడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమన్నారు. ఎవరినీ నిర్బంధించడం, అవమానించడం తమ ఉద్దేశం కాదని, చట్టపరమైన పరిధిలో గౌరవప్రదమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు.వ్యాసాశ్రమానికి సంబంధించిన సమస్యల పరిష్కార ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని వర్గాలు సంయమనం పాటించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ విజ్ఞప్తి చేశారు. మీడియా లేదా ఇతర వేదికల ద్వారా వివాదాలను మరింత పెంచకుండా, అందరూ పరస్పరం చర్చించుకుని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. ప్రభుత్వం అన్ని సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, చట్టపరమైన పరిధిలో వ్యాసాశ్రమాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. వ్యాసాశ్రమం తన ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుకుంటూనే విద్య, సంస్కారం, సేవా కార్యక్రమాల్లో మళ్లీ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ… వ్యాసాశ్రమం ప్రైవేట్, ఆధ్యాత్మిక సంస్థగా ఉన్నందున రాజకీయ జోక్యం లేకుండా సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాసాశ్రమంతో తనకు ఉన్న అనుబంధం దృష్ట్యా, సంస్థ పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మరియు పీఠాధిపతుల మధ్య సమన్వయకర్తగా తన వంతు సహకారం అందిస్తానన్నారు. గతంలో ఉన్న విధంగా ఒక సమర్థవంతమైన కమిటీ ద్వారా వ్యవస్థను పద్ధతిగా నిర్వహించడం వల్ల నిర్ణయాల్లో పారదర్శకత, సమష్టి బాధ్యత ఏర్పడుతుందని తెలిపారు. పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు, భక్తులు తమ సూచనలు, కార్యాచరణ ప్రణాళికను జిల్లా కలెక్టర్, ఎస్పీలకు అందించాలని, వాటి ఆధారంగా సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఆలయ చైర్మన్ కోలా ఆనంద్ మాట్లాడుతూ..వ్యాసాశ్రమానికి గతంలో ఉన్న విద్యా, ఆధ్యాత్మిక, సామాజిక ప్రాధాన్యతను తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సద్గురు మలయాళస్వామి వారి ఆశయాలకు అనుగుణంగా ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలని, విద్యా సంస్థలు, గురుకులాలు, వృద్ధాశ్రమం వంటి గతంలోని సేవా కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యాసాశ్రమానికి దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ పూర్వ విద్యార్థులు, అనుబంధం ఉన్నవారు ఉన్నారని, వారందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఆశ్రమాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ…వ్యాసాశ్రమానికి సంబంధించిన కార్యక్రమాలు శాంతియుతంగా, అందరి సహకారంతో నిర్వహించేందుకు పోలీసు శాఖ అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. శతాబ్ది ఉత్సవాల వంటి భారీ కార్యక్రమాలకు తగిన భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు అవసరమవుతుందని, అందువల్ల కార్యక్రమాల తేదీలను ముందస్తుగా సమన్వయంతో నిర్ణయించుకోవాలని సూచించారు.

పలువురు పీఠాధిపతులు మాట్లాడుతూ… వ్యాసాశ్రమానికి గతంలో ఉన్న విద్యా ప్రాధాన్యతను తిరిగి తీసుకురావాలని సూచించారు. బ్రహ్మవిద్యా పాఠశాల, గురుకుల విద్య, కన్యా గురుకులం వంటి విద్యా కార్యక్రమాలను నిబంధనల ప్రకారం పునఃప్రారంభించి, విద్యార్థులకు ఆధ్యాత్మికత, విద్య, సంస్కారం కలగలిపిన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశ్రమానికి చెందిన పుస్తకాలు, గ్రంథాలు, ఆధ్యాత్మిక రచనలు ప్రచురణకు నోచుకోకుండా ఉండకుండా వాటిని పరిరక్షించి, అవసరమైన విధంగా ముద్రణ, ప్రచురణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆశ్రమ శాఖలు, అనుబంధ సంస్థల కార్యకలాపాలను కూడా పునరుద్ధరించే విధంగా ప్రణాళిక రూపొందించాలని కోరారు. వ్యాసాశ్రమ అభివృద్ధి కోసం పారదర్శకమైన ట్రస్ట్ లేదా కమిటీ ఏర్పాటు చేసి, పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు, సీనియర్ భక్తులు, ఆశ్రమంతో అనుబంధం ఉన్నవారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు సూచించారు. ఆశ్రమ స్థాపన లక్ష్యాలు, విద్యా మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలు, గురుకుల వ్యవస్థ, సేవా కార్యక్రమాలు తదితర అంశాలను పునరుద్ధరించే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు కోరారు.ఈ సమావేశంలో డి.ఆర్.ఓ నరసింహులు, శ్రీకాళహస్తి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ చెంచయ్య, పోలీసు శాఖ అధికారులు, జిల్లా దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పీఠాధిపతులు, స్వామీజీలు, వ్యాసాశ్రమం పూర్వ విద్యార్థులు, సీనియర్ భక్తులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *