మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): భూ భారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న భూముల రీ-సర్వేకు పట్టాదారు రైతులు పూర్తి సహకారం అందించాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి కోరారు. బుధవారం మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్, సింగితం, వెంగళంపల్లి, నర్సాపూర్ రెవెన్యూ శివార్లలో నిర్వహిస్తున్న భూముల రీ-సర్వేపై రైతులకు అవగాహన కల్పిస్తూ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, అటవీ, రెవెన్యూ భూముల హద్దులను శాశ్వతంగా నిర్ధారించేందుకు ప్రభుత్వం భూ భారతి కార్యక్రమం ద్వారా రీ-సర్వే చేపట్టిందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.
కొన్నేళ్లుగా సాగు చేస్తూ అటవీ శాఖ అనుమతులు పొందిన అర్హులైన రైతుల వివరాలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టాలు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు సర్వే బృందాలకు అవసరమైన పత్రాలు అందించి, రీ-సర్వేను విజయవంతం చేయాలని కోరారు.అనంతరం తహసీల్దార్ లత మాట్లాడుతూ, రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీ-సర్వే చేపట్టిందన్నారు. భూ హద్దులు స్పష్టంగా నమోదవడం వల్ల భవిష్యత్తులో వివాదాలకు తావుండదని, రైతులందరూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సింగితం సర్పంచ్ సయ్యద్ రఫీ, తెల్గాపూర్ సర్పంచ్ వెల్లుట్ల మేఘన, తహసీల్దార్ లత, మండల సర్వేయర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *