నేను మాటలు చెప్పేవాడిని కాదు..పనులు పూర్తి చేసి చూపించేవాడిని”. మీడియాతో ఇష్టాగోష్టిలో తుడా చైర్మన్ డా || డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుపతి నగరంతో పాటు, తిరుచానూరు పరిసర ప్రాంతాల అభివృద్ధికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోందని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి డా||డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. పెండింగ్‌ లో ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్లు, చెరువుల సుందరీకరణ, తిరుచానూరులో మౌలిక సదుపాయాల కల్పనపై పలు కీలక అంశాలను వెల్లడించారు.తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒకటి, రెండు పనులు మినహా దాదాపు అన్ని పనులను పూర్తి చేసి చూపించానని, ప్రారంభించిన ప్రతి పనిని పూర్తి చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన ఉద్ఘాటించారు.అభివృద్ధి పనుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమని, అందరికీ సంతోషంగా ఇళ్లు ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు.ప్రజలకు, నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.తిరుమల తర్వాత అత్యంత రద్దీగా ఉండే తిరుచానూరు అమ్మవారి ఆలయానికి ప్రతిరోజూ 30 వేల నుంచి 35 వేల మంది భక్తులు వస్తారని తెలిపారు.ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తితిదే చైర్మన్ తో సమన్వయం చేసుకుంటూ మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామన్నారు.ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైవే నుంచి అమ్మవారి ఆలయానికి 60 అడుగుల రోడ్డును అభివృద్ధి చేస్తున్నామన్నారు.అలాగే, కోర్టు కాంప్లెక్స్ నుంచి కోట్రమంగళం వెళ్లే రోడ్డుకు అనుసంధానంగా 100 అడుగుల రోడ్డు ను నిర్మిస్తున్నట్లూ తెలిపారు.కేవలం వారం రోజుల వ్యవధిలోనే రూ. 1.75 కోట్లతో 1.1 కి.మీ రోడ్డు పనులను పూర్తి చేసి సుప్రీంకోర్టు సీజే రాక సందర్భంగా అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు.రాబోయే రోజుల్లో తిరుపతి జనాభా 8-9 లక్షలకు చేరుకునే అవకాశం ఉందన్నారు.భవిష్యత్ తాగునీటి అవసరాలు, భూగర్భ జలాల పెంపు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ఆలోచనల మేరకు “సిటీ ఆఫ్ లేక్స్” అమలు చేస్తున్నట్లు తెలిపారు.శ్రీనివాస మంగాపురం చెరువు నుంచి పేరూరు, తుమ్మలగుంట, అవిలాల,దామినేడు చెరువులను కలుపుతూ కాలువలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.వృథా నీరు స్వర్ణముఖి నదిలోకి పోకుండా ఈ చెరువులన్నీ నిండే లా కాలువలు అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.కపిలతీర్థం వద్ద వృథాగా పోతున్న నీటిని సమీపంలోని చెరువుకు మళ్లించడం ద్వారా సుమారు 60-70 వేల మందికి గ్రావిటీ ద్వారా త్రాగునీరు అందించే ప్రాజెక్టును చేపడుతున్నట్లు చెప్పారు.157 ఎకరాల్లో విస్తరించి ఉన్న అవిలాల చెరువును ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.అవిలాల చెరువు ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ట్యాంకుబండ్ గా అభివృద్ధి చేయాలని సంకల్పించరారన్నారు.తిరుపతి తూర్పు ప్రాంతం వరద ముంపునకు గురికాకుండా ఉండేందుకు, పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే నీటిని అవిలాల చెరువుకు మళ్లించేలా రూ. 8 కోట్లతో 4.8 కి.మీ ఛానల్ ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు.చెరువు కట్ట చుట్టూ 40-45 అడుగుల వెడల్పుతో వాకింగ్/జాగింగ్ ట్రాక్‌లు, బ్రాండెడ్ షాప్స్, ఫుడ్ కోర్టులు, 30-35 గదులతో మినీ కన్వెన్షన్ సెంటర్, హోటల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని తెలిపారు.ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌ లో ఉన్న ఆర్టీఏ ఆఫీస్ రోడ్డు పనులకు మోక్షం కల్పించామని,పైప్‌లైన్ షిఫ్టింగ్ కోసం తుడా నుంచి రూ. 3.10 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.మిగిలిన రోడ్డు పనుల కోసం రూ. 15 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నట్లూ తెలిపారు.రెండు జాతీయ రహదారులను కలుపుతూ..కళ్యాణి డ్యామ్ నుంచి మామండూరు వరకు 6.9 కి.మీ మేర 100 అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.పాత మరియు కొత్త ఎయిర్‌పోర్ట్ రోడ్లను కలుపుతూ 7.25 కి.మీ మేర రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నట్టు,పెండింగ్ రోడ్లన్నీ రాబోయే ఒక ఏడాది కాలంలో పూర్తి చేసి తీరుతామని తెలిపారు.రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి పనుల్లో ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామన్నారు.వారికి తగిన నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయ ఇళ్లు అందించేలా జిల్లా కలెక్టర్ తో కలిసి పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నామని తుడా చైర్మన్ తెలిపారు.ప్రజల ఆనందమే లక్ష్యంగా, తుడా అధికారులు, ప్రణాళికా విభాగం పారదర్శకంగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *