చోడవరం గ్రామంలో రూ.50 లక్షల సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన..!
జలదంకి జూలై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

జలదంకి మండలం, చోడవరం గ్రామంలో జడ్పీ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.అందులో భాగంగానే చోడవరం గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు. ఈ రోడ్లు పూర్తయిన అనంతరం గ్రామ ప్రజలు వర్షాకాలంలో బురద సమస్యలు, రవాణా ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడంతో పాటు, గ్రామంలో పరిశుభ్రత, రాకపోకల సౌలభ్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి పనులకే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి కొనసాగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
