రేణిగుంట, జూన్ 19:

నేటి సమాజంలో మత్తు పదార్థాల వాడకం ఒక మహమ్మారిలా ప్రాకుతూ కుటుంబ వ్యవస్థలను, సాంఘిక వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తోందని ‘రాస్ రాష్ట్రీయ సేవా సమితి’ కౌన్సిలర్ పి. నాగరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలంలోని సి డబ్ల్యూ సి గోడమ్స్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం రాస్ సంస్థ ఆధ్వర్యంలో మత్తుపదార్థాల వ్యసన విముక్తిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత, వయస్సు అనే తేడా లేకుండా పిల్లా-పెద్దా అందరూ మద్యం, గంజాయి, గుట్కా వంటి దుర్వ్యసనాలకు బానిసలై తమ అమూల్యమైన ప్రాణాలను, ధన, మానాలను ఫణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. మితిమీరిన త్రాగుడు వల్ల శారీరక, మానసిక సామర్థ్యం దెబ్బతిని, రోగనిరోధక శక్తి క్షీణించి బాధ్యతారహితంగా మారుతూ చివరికి మరణానికి చేరువవుతున్నారని హెచ్చరించారు.
ఈ విపత్కర పరిస్థితుల నుండి మత్తు బానిసలను రక్షించేందుకు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం, పాపానాయుడుపేటలోని తమ ‘రాస్ పునరావాస కేంద్రం’ పూర్తి ఉచిత సేవలను అందిస్తోందని నాగరాజు వెల్లడించారు. తమ కేంద్రంలో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సైకోథెరపిస్టులు, కౌన్సిలర్ల పర్యవేక్షణలో ఉచిత మందులు, కౌన్సిలింగ్, యోగా, ధ్యానం మరియు వివిధ రకాల మానసిక ఉల్లాస కార్యక్రమాల ద్వారా వ్యసనపరులను తిరిగి సాధారణ మనుషులుగా మారుస్తున్నామని తెలిపారు. 20 బెడ్ల వసతి, పరిశుభ్రమైన వాతావరణం కలిగిన తమ కేంద్రంలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారిని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు గుర్తించి, పాపానాయుడుపేటలోని కేంద్రానికి పంపించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సహకరించాలని ఆయన కోరారు. చికిత్స మరియు ఇతర వివరాల కోసం 08772999356 నంబరును సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *