మన ధ్యాస ,కామారెడ్డి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పట్టుదల, నిరంతర కృషి ఫలించి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయ భవన నిర్మాణానికి ఎకరం ప్రభుత్వ భూమి మంజూరైంది.కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని అడ్లూర్ శివారులో సర్వే నంబర్ 527/42/1/2లో ఒక ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత కార్యాలయ భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది.ఏలే మల్లికార్జున్ రాజకీయ ప్రస్థానం నిజాంసాగర్ మండలం వైస్ ఎంపీపీ పదవి నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ వస్తున్నారు.డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ విస్తరణ, కార్యకర్తల సమన్వయం, సంస్థాగత బలోపేతంతో పాటు జిల్లాకు సొంత పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత కార్యాలయం లేకపోవడాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో స్థలం మంజూరు చేయించడంలో విజయవంతమయ్యారు.
ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. సొంత కార్యాలయ భవనం ఏర్పాటుతో పార్టీ సమావేశాలు, శిక్షణా శిబిరాలు, ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాలకు ఒక పటిష్ట వేదిక లభిస్తుందన్నారు.త్వరలోనే శంకుస్థాపన చేసి, ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆదర్శవంతమైన కాంగ్రెస్ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు.జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇది పార్టీ బలోపేతానికి మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *