పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి . హాల్ టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం(ఆర్‌టీఐ) ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర .

బంగారుపాల్యం, మనధ్యాస, మార్చి15. రిపోర్టర్:కమల్ రెడ్డి.

వార్షిక పరీక్షలకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకుని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని (ఆర్‌టీఐ) ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జన్నావుల సురేంద్ర మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో పదో తరగతి అనేది అత్యంత కీలకమైన మలుపు అని, దీన్ని ఎంతో బాధ్యతగా ఎదుర్కోవాలని సూచించారు. ముఖ్యంగా సమయపాలన విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు అధికారులు నిర్ణయించిన సమయం కంటే కనీసం 30 నుండి 45 నిమిషాల ముందుగానే చేరుకోవడం చాలా అవసరం అని తెలిపారు. చివరి నిమిషంలో హడావిడి పడటం వల్ల మానసిక ఆందోళన పెరిగి తెలిసిన సమాధానాలు కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే ప్రశాంతమైన మనసుతో పరీక్షా హాలులోకి వెళ్లాలని సూచించారు.పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదని, అవి విద్యార్థుల ప్రతిభను నిరూపించుకునే సువర్ణావకాశమని ఆయన అన్నారు. అనవసరమైన ఒత్తిడికి లోనుకాకుండా, క్రమశిక్షణతో చదివిన విషయాలను ప్రశాంతంగా పేపర్‌పై రాయాలని సూచించారు. “మీరు సాధించే ప్రతి మార్కు మీ తల్లిదండ్రుల కష్టానికి, మీ గురువుల శ్రమకు దక్కే గౌరవం. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి” అని ఆయన ఆకాంక్షించారు.పరీక్షల సమయంలో చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని జన్నావుల సురేంద్ర గుర్తుచేశారు. విద్యార్థులు సమయానికి పోషకాహారం తీసుకోవాలని, తగినంత నీరు తాగుతూ, కంటినిండా నిద్రపోవాలని సూచించారు. అప్పుడే మెదడు చురుగ్గా పనిచేసి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించగలరని తెలిపారు.అదేవిధంగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉన్నందున ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్య ద్వారా సామాజిక న్యాయం, బాధ్యతాయుతమైన పౌరసత్వం సాధ్యమవుతుందని పేర్కొంటూ విద్యార్థులు ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు. చివరగా రాష్ట్రంలోని అన్ని విద్యార్థులకు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *