అనంతపురం, మన ధ్యాస: అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌లో గల జన సంఘం కార్యాలయంపై అర్ధరాత్రి దుండగులు దాడికి పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ కో-కన్వీనర్ చిందనూరు నాగరాజు పేర్కొన్నారు.దుండగులు కార్యాలయంలోకి చొరబడి అక్కడ ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు, జన సంఘం నేత దాసగాని కుల్లాయప్పకు సంబంధించిన ఫ్లెక్సీలను చించి, ఫోటోలో తలను, మొండాన్ని వేరు చేస్తున్నట్లుగా కత్తులతో కోసినట్లు సమాచారం. అంతేకాక కార్యాలయంలో ఉన్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపారు.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలంటూ అనంతపురం జిల్లా ఎస్పీని నాగరాజు కోరారు. ఇది కేవలం ధ్వంసకాండ కాకుండా, జన సంఘం నేత దాసగాని కుల్లాయప్పకు హెచ్చరికగా, భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతో జరిగిన దాడిగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.దాడి వెనుక ఉన్న అసలు నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేసి, కుట్రలో భాగమైన వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి తీవ్రతను గమనిస్తే దాసగాని కుల్లాయప్పకు ప్రాణహాని ఉన్నట్లు అనిపిస్తోందని, వెంటనే భద్రత కల్పించాలని ఆయన కోరారు.దళిత నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బహుజన వర్గాలపై ఎటువంటి దాడులు జరిగినా బహుజన సమాజ్ పార్టీ ముందుండి రక్షణగా నిలుస్తుందని నాగరాజు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *