పార్వతీపురం, మన ధ్యాస, డిశంబర్ 27:
భద్రగిరికి చెందిన వృద్ధ మహిళ కె. రాధమ్మ( 65) అనే రోగిని గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భద్రగిరి సిహెచ్‌సికి తీసుకువచ్చారని పార్వతీపురం జిల్లా కో-ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అధికారి డా||జి. నాగభూషణ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన చెత్త తీసుకెళ్లే రిక్షాలో మృతదేహం తరలింపు కధనానికి ఆయన స్పందించారు. కె. రాధమ్మ( 65)కు డయాబెటిస్ మెల్లిటస్ మరియు అధిక రక్తపోటు ఉన్నట్లు రిపోర్టులో తెలిసిందని పేర్కొన్నారు. ఆమె మందులు సరిగ్గా వేసుకోకపోవడం, ఆసుపత్రిలో చేరే సమయంలో, ఆమె కడుపు నొప్పితో బాధపడుతోందని వివరించారు. ఆసుపత్రిలో అవసరమైన వైద్య సేవలు అందించినప్పటికీ, చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు కె. రాధమ్మ( 65) మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ఆమె మరణించిన తరువాత, ఆమె తమ్ముడు మృతదేహాన్ని సొంత రిక్షాలో వారి నివాసానికి తీసుకెళ్లాడని తెలిపారు. మృతురాలి ఇల్లు ఆసుపత్రి నుండి 1 కి.మీ. దూరంలో ఉండటంతో అంబులెన్స్ కోసం వేచి చూడలేదని అన్నారు. మీడియా సిబ్బంది కూడా ఇదే విషయాన్ని అంగీకరించారని, ఇల్లు ఆసుపత్రికి దగ్గరగా ఉండటంతో బంధువులు ఆమె మృతదేహాన్ని నేరుగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.
ఈ ఘటనలో భద్రగిరి సిహెచ్‌సి ఆరోగ్య సిబ్బంది ఎటువంటి పొరపాటు చేయలేదని, నిర్లక్ష్యం వహించలేదని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *