మన ధ్యాస ,నెల్లూరు , డిసెంబర్ 21 :నెల్లూరు నగరంలోని బృందావనం ప్రాంతంలో ఉన్న శ్రీ దుర్గ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ యాజమాన్యం పూర్వీకుల జ్ఞాపకార్థం ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిల్లల వైద్యం, షుగర్, బీపీ, కంటి పరీక్షలు, రక్తపరీక్షలు, ఎక్స్ రే, సిటీ స్కాన్లు తదితర విభాగాల్లో అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య సేవలు అందించారు. శిబిరానికి వచ్చిన రోగులకు అవసరమైన పరీక్షలు ఉచితంగా నిర్వహించి, తగిన సలహాలు ఇచ్చారు. కొన్ని మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.ఈ ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో శ్రీ దుర్గ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పల్లం రెడ్డి యశోద మాట్లాడుతూ ……ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. సమాజంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు, ఆర్థిక భారాన్ని తగ్గించడానికే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మహిళల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తలు, బాలికల ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యత, దీర్ఘకాలిక వ్యాధుల నివారణపై వైద్యులు సూచనలు చేశారు. అలాగే షుగర్, బీపీ వంటి వ్యాధులు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈశిబిరంలో పాల్గొన్న స్థానిక ప్రజలు మాట్లాడుతూ…..ఇలాంటి ఉచిత వైద్య సేవలు తమకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు అందుబాటులో లేని పేదలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలను తరచూ నిర్వహించాలని హాస్పిటల్ నిర్వాహకులను కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గ హాస్పిటల్ వైద్య బృందంతో పాటు నర్సింగ్ సిబ్బంది, వాలంటీర్లు చురుకుగా పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. చివరగా హాస్పిటల్ యాజమాన్యం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.



