11,661 ఓట్లకు గానూ 6,527 ఓట్ల పోలింగ్.. 3,870 ఓట్ల భారీ మెజార్టీతో రికార్డు విజయం…మంచం గుర్తుపై పోటీ చేసి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం..ఆర్వో అధికారిక ధ్రువీకరణ..విజయం వెనుక మహబూబ్ బాషా రాజకీయ సమన్వయం..ఫోన్ చేసి అభినందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి…పెద్దల సహకారంతో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: నూతన సర్పంచ్ చిత్ర.
రేణిగుంట (తిరుపతి జిల్లా):
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేణిగుంట పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగిన పోరులో కూటమి బలపరిచిన అభ్యర్థి, డి.పి. విశ్వనాథం కోడలు జె. చిత్ర (జయచిత్ర) అఖండ విజయం సాధించారు. మంచం గుర్తుపై బరిలోకి దిగిన ఆమె, 11,661 ఓట్లకు గానూ 6,527 ఓట్లు పోలవ్వగా, సమీప ప్రత్యర్థులపై ఏకంగా 3,870 ఓట్ల భారీ మెజార్టీతో రికార్డు సృష్టించారు. ఆమె గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ధ్రువీకరించారు.
విజయం వెనుక మహబూబ్ బాషా సమన్వయం.. ఎమ్మెల్యే అభినందనలు
ఈ గెలుపు వెనుక రేణిగుంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహబూబ్ బాషా రాజకీయ సమన్వయం, ప్రచార వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి ఇంటింటి ప్రచారాన్ని ముందుండి నడిపించిన ఆయన కృషిని పార్టీ వర్గాలు కొనియాడాయి. ఈ విజయంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించి, మహబూబ్ బాషాకు ఫోన్ చేసి అభినందించడంతో పాటు నూతన సర్పంచ్ జె. చిత్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఆశీర్వాదాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసే ప్రజలు ఈ ప్రచండ విజయాన్ని అందించారని మహబూబ్ బాషా హర్షం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చేసి చూపిస్తా: సర్పంచ్ జె. చిత్ర మరియు డి.పి. విశ్వనాథం
తన గెలుపు కోసం కృషి చేసిన మహబూబ్ బాషా, జనసేన యువ నాయకుడు మిధున శాలి, బీజేపీ నాయకులు బి.డి. బాలాజీ మరియు కూటమి శ్రేణులకు జె. చిత్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దల సహకారంతో రేణిగుంటను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. మరోవైపు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆశీస్సులు, కూటమి నాయకుల సమష్టి కృషి వల్లే తమ కోడలు రికార్డు మెజార్టీతో గెలిచారని, ఇది ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని డి.పి. విశ్వనాథం అన్నారు.
పట్టణమంతా విజయోత్సవాల సందడి
ఫలితాలు వెలువడిన వెంటనే రేణిగుంట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. కూటమి నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ భారీ ఊరేగింపు నిర్వహించారు. రేణిగుంట చరిత్రలో నమోదైన ఈ భారీ మెజార్టీ స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




