స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కోసం నేతల అభ్యర్థనలు.. అభ్యర్థుల ఎంపికపై బిజీబిజీగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉదయగిరి, అక్టోబర్ 15, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం హీటెక్కింది. టికెట్ల కోసం ఆశావహులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉదయగిరి,నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు, యువ నాయకులు ఎమ్మెల్యే కాకర్లను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలపై గురిపెట్టిన నేతలు తమ బలాన్ని వివరిస్తూ టికెట్ల కోసం పట్టుబడుతున్నారు.

టికెట్ల కోసం పోటాపోటీ!

“పార్టీ కష్టకాలంలో మేమున్నాం.. ప్రజల్లో మాకు పట్టుంది” అంటూ నేతలు ఎమ్మెల్యే ముందు తమ వాదనలు వినిపిస్తున్నారు. తమ గ్రామాల్లో ఉన్న పట్టు, కార్యకర్తల బలం, గత ఎన్నికల్లో చేసిన సేవలను ఏకరువు పెడుతూ టికెట్ ఆశిస్తున్నారట.

ఆచితూచి అడుగులు వేస్తున్న కాకర్ల!

అయితే టికెట్ల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని, పార్టీకి విధేయులైన వారినే ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారట. స్థానిక సమీకరణాలు, కుల సమీకరణాలు, ప్రజాదరణ అన్నీ పరిశీలించి ఫైనల్ లిస్ట్ ను అధిష్టానానికి పంపే పనిలో బిజీగా ఉన్నారని పార్టీ వర్గాల టాక్.

ఉత్కంఠలో ఆశావహులు!

ఎవరికి టికెట్ దక్కుతుంది? ఎవరిని పక్కన పెడతారు? అనేది ఇప్పుడు ఉదయగిరి టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. టికెట్ ఆశావహులు ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యే కాకర్ల కసరత్తుతో నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *