​రేణిగుంట:

తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు రంగానికి దిగారు. రేణిగుంట సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ ఇన్ స్పెక్టర్ జయచంద్ర, రేణిగుంట తహసీల్దార్ శ్రవణ్ కుమార్ మరియు ఎంపీడీఓ రవిచంద్ర సంయుక్తంగా మండల పరిధిలోని పలు పోలింగ్ బూత్‌లను సందర్శించి విస్తృతంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

​సిఐ జయచంద్ర మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పగడ్బందీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

​అనంతరం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు మాట్లాడూతూ, ఓటర్లకు అవసరమైన తాగునీరు, విద్యుత్, ర్యాంప్ వంటి మౌలిక సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *