కలిగిరి, అక్టోబర్ 04, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కొత్తూరు గ్రామంలో వెలసిన గ్రామదేవత, భక్తుల కొంగు బంగారమైన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ ఐదు రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ముగిశాయి.
*దేదీప్యమానంగా ఆలయ అలంకరణ:*
ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. చుట్టుపక్కల గ్రామాలైన కలిగిరి, దుత్తలూరు, వింజమూరు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో కొత్తూరు గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. అమ్మవారి నామస్మరణతో గ్రామం మార్మోగింది.
*ఐదు రోజుల పాటు విశేష పూజలు:*
ఉత్సవాల్లో భాగంగా తొలి నాలుగు రోజుల పాటు గ్రామ మహిళలు, భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో చద్ది నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో నిత్యం భజనలు, కోలాటాలు, అమ్మవారి చరిత్ర పారాయణం నిర్వహించారు.ఐదో రోజు ఉత్సవాల ముగింపు రోజు ప్రధాన ఘట్టంగా పొంగళ్ళ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు సాంప్రదాయబద్ధంగా కొత్త కుండలలో పొంగళ్ళు వండి, పసుపు కుంకుమలతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.
*అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు:*
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ పోలేరమ్మ తల్లికి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, మహా మంగళహారతి ఘనంగా నిర్వహించారు.
*2000 మందికి భారీ అన్నదానం:*
ఈ సందర్భంగా అర్చకులు శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ… కొత్తూరు గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, గ్రామం సుభిక్షంగా, పాడిపంటలతో విలసిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రామ పెద్దలు మరియు యువకుల సహకారంతో సుమారు 2000 మందికి పైగా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఐదు రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రశాంతంగా ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *