తిరుపతి, సెప్టెంబర్ 13: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 15, 16 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు, భద్రత విషయంలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.

​ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నందు ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణలతో కలిసి కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటించే విమానాశ్రయం, హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గాలు మరియు ఇతర అన్ని ప్రదేశాల్లో విధులు కేటాయించిన అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్‌తో కూడిన మెడికల్ క్యాంపులు, అంబులెన్సులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమన్వయం చేసుకోవాలని సూచించారు.

​అలాగే పర్యటన ముగిసే వరకు విద్యుత్ అంతరాయం కలగకుండా ఏపీఎస్పీడీసీఎల్ చర్యలు తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్, వాహనాల కాన్వాయ్ మరియు ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీతో కలిసి ఎయిర్‌పోర్ట్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

​ఈ సమావేశంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, అడిషనల్ ఎస్పీలు రవిమనోహర్ అచ్చారి, శ్రీనివాసరావు, శ్రీనివాసులు, డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, ఆర్ అండ్ బి ఎస్ఈ రాజా నాయక్, జిల్లా రవాణా అధికారి మురళీ మోహన్, ఎయిర్‌పోర్ట్ అధికారి భూమినాథన్, వివిధ శాఖల డీఎస్పీలు, సీఐలు, భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *