రేణిగుంట: రాబోయే వినాయక చవితి పండుగ మరియు ఇతర ఉత్సవాల నేపథ్యంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీ శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ.. రేణిగుంట పట్టణ పరిధిలో వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించవద్దని కఠినంగా ఆదేశించారు. పండుగల సమయంలో ఎలాంటి అనవసర గొడవలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని సన్మార్గంలో జీవించాలని, లేనిపక్షంలో వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా చట్టప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

​అలాగే, రాబోయే వినాయక మండపాల వద్ద లేదా వేడుకల ప్రాంగణాల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు. అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై ప్రత్యేక కన్ను ఉంటుందని సీఐ హెచ్చరించారు. ప్రజలంతా ఉత్సవాలను ప్రశాంతంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాసులు, రేణిగుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు పరిధిలోని రౌడీ షీటర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *