విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, వినూత్న బోధనకు దక్కిన గుర్తింపు..

ఎస్‌బీవీ పురం సెప్టెంబర్ 05.

విద్యార్థుల విద్యాభివృద్ధి, వినూత్న బోధనా పద్ధతులు, పాఠశాల అభివృద్ధిలో విశేష కృషి చేసిన ఎస్‌బీవీ పురం పాఠశాల ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలు ఎం.ఎం. శాంతి ‘జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు’ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి చేతులమీదుగా అందుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సమాజ భాగస్వామ్యంతో పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆమె సేవలకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
వినూత్న బోధన.. విద్యార్థుల నమోదుపై ప్రత్యేక దృష్టి
డిజిటల్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, చైల్డ్ సెంట్రిక్ పెడగాజీ వంటి ఆధునిక పద్ధతులతో శాంతి పాఠాలు బోధిస్తున్నారు. తక్కువ ఖర్చుతో కూడిన బోధనా సామగ్రి , వినూత్న ప్రాజెక్టులు, భాషా ఆటల ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందిస్తున్నారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించి పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
క్రీడలు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట
కేవలం చదువే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ.. వార్షికోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, సైన్స్ ప్రాజెక్టులు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘ఆక్సిజన్ ఫౌండేషన్’ సహకారంతో పాఠశాల ప్రాంగణంలో 100కు పైగా మొక్కలు నాటారు. అంతేకాకుండా, గ్రామస్థుల భాగస్వామ్యంతో పాఠశాలలో సేంద్రీయ కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేయడం విశేషం.
డిజిటల్ వేదికగా విద్యార్థుల ప్రతిభ
విద్యార్థుల నైపుణ్యాలను నలుదిశలా చాటేందుకు ‘ఐ స్మార్ట్ లెర్న్ ‘ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా తరగతి గది కార్యకలాపాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను అందరితో పంచుకుంటున్నారు. అలాగే తల్లిదండ్రులతో నిరంతరం మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, ప్రవర్తన తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
మరింత బాధ్యత పెరిగింది… ఎం.ఎం. శాంతి
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్న శాంతిని తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఈ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో మరింత అంకితభావంతో పనిచేస్తాను” అని హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *