మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి.. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులదే బాధ్యత: డీఎస్పీ శ్రీనివాసరావు.

డీజేలు, అసభ్య ప్రదర్శనలకు అనుమతి లేదు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి..ఆన్‌లైన్‌లోనే ఉచితంగా గణేష్ మండపాల అనుమతులు.. డీజేలు, అసభ్య ప్రదర్శనలకు నో.. సీఐ మంజునాథరెడ్డి.

వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి సూచించారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక చవితి మండపాల నిర్వాహకులతో సమావేశం అయ్యారు.

మండపాల అనుమతుల కోసం గణేష్ ఉత్సవ్.నెట్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, విగ్రహం–మండపం ఎత్తు, కమిటీ సభ్యుల వివరాలు, నిమజ్జనం తేదీ, సమయం, ప్రదేశం తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేయాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న మండపాలకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తామని తెలిపారు.

మండపాల వద్ద డీజేలు, అసభ్యకర ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జనం ఊరేగింపులు నిర్ణయించిన మార్గాల్లోనే నిర్వహించాలని, మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనరాదని సూచించారు. అల్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావివ్వకుండా ఉత్సవ కమిటీలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సూచించారు. దీంతో నిర్వాహకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు అవాంఛనీయ ఘటనలు జరిగితే గుర్తించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఉత్సవ కమిటీ నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించి వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైటర్ మణి, పోలీస్ సిబ్బంది, గణేష్ ఉత్సవ కమిటీ తిరుపతి నిర్వాహకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *