రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర.
రేణిగుంటలో ప్రశాంత వాతావరణంలో గంగమ్మ జాతర నిర్వహణకు పోలీసుల ప్రత్యేక చర్యలు…
రేణిగుంట ఆగష్టు 17.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట పట్టణంలో నిర్వహించే శ్రీ గంగమ్మ జాతరకు భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రేణిగుంట సీఐ జయచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా రేణిగుంట డిఎస్పి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సీఐ జయచంద్ర పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సీఐ జయచంద్ర మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి, రేణిగుంట పరిసర ప్రాంతాల నుండి మరియు పారిశ్రామిక వాడల నుండి భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పోలీసు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. జాతర సమయంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, అలాగే ఎలక్ట్రికల్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలు జరగకుండా నిరంతరం పహారా కాయాలని, విధులు కేటాయించిన పోలీసులు తమకు నిర్ణయించిన స్థానాల్లోనే ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. జాతరలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకోవాలని, అక్కడ ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ జయచంద్రతో పాటు ఎస్ఐ శ్రీనివాసులు, రైటర్ చలపతి మరియు పోలీస్ బృందం పాల్గొన్నారు

