రాయదుర్గంలో సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ వినతి – నీట్ పేపర్ లీకేజీ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం డిమాండ్

రాయదుర్గం, జూలై 27: నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను రద్దు చేసి, నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం రాయదుర్గం తహసీల్దార్ సురేష్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ రాయదుర్గం తాలూకా కార్యదర్శి నాగార్జున, ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా కోశాధికారి ఆంజనేయులు, ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కావలి కోట్రేష్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలమైందని ఆరోపించారు. పేపర్ లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని, తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయని పేర్కొన్నారు.నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజాసంఘాలు నిరసనలు చేపట్టినా, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపకుండా లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాలు చేసిందని విమర్శించారు. నిరసనలకు మద్దతు తెలిపిన పర్యావరణవేత్త, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్చుక్‌ను అరెస్టు చేయడాన్ని కూడా ఖండించారు.

ప్రధాన డిమాండ్లు:

నీట్ పేపర్ లీకేజీ కారణంగా మరణించిన లేదా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లించాలి.

★ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను వెంటనే రద్దు చేయాలి.

★ నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి.

★విద్యను కేంద్రీకరించి కార్పొరేట్లకు అప్పగించే విధానాలను రద్దు చేయాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తిప్పేస్వామి, అంజప్ప, రవి, అలాగే విద్యార్థి, యువజన సంఘాల నాయకులు గోపీనాథ్, కృష్ణ, రాజు, తరుణ్, భాను, బాలాజీ, దీపు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *