శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే సైన్స్ యాత్రల లక్ష్యం..

వింజమూరు, జూలై 13, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు..

డాక్టర్ జి. విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సహకారంతో నిర్వహిస్తున్న జిల్లా విద్యార్థుల సైన్స్ యాత్ర వింజమూరు జడ్పీహెచ్ఎస్ (ZPHS) ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విద్యార్థుల సైన్స్ యాత్ర బస్సుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా తత్వం మరియు సైన్స్ విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు ఇటువంటి సైన్స్ యాత్రలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.పాఠ్యపుస్తకాలలో చదివే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించేలా విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సైన్స్ యాత్రలో భాగంగా విద్యార్థులు ముందుగా జిల్లా సైన్స్ సెంటర్ ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు మరియు విజ్ఞాన ప్రదర్శనలను పరిశీలించి శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకోనున్నారు. అనంతరం జిల్లా మ్యూజియంను సందర్శించి చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటారు. తర్వాత సర్ సి.వి. రామన్ సైన్స్ సెంటర్ కు వెళ్లి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు మరియు వివిధ సైన్స్ అంశాలపై అవగాహన పెంపొందించుకొని సాయంత్రం తిరిగి వింజమూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చేరుకుంటారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు డాక్టర్ జి. విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *