రేణిగుంట జులై 10: గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లికేసం గ్రామంలో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ హరీష్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రాత్రి బస చేసిన పోలీసులు, గ్రామస్తులతో కలిసి సామాజికాంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు చేపట్టారు. సదస్సులో సీఐ మంజునాథ రెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాల నియంత్రణకు చట్టాలు పటిష్టంగా ఉన్నాయని, ఆపద సమయంలో తక్షణ సహాయం కోసం ప్రతి మహిళా తమ మొబైల్‌లో ‘శక్తి యాప్’ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. అలాగే గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పి సైబర్ మోసాల బారిన పడొద్దని, ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. పోలీసులు స్వయంగా తమ గ్రామానికి వచ్చి రాత్రి బస చేసి చైతన్యపరచడం పట్ల అల్లికేసం గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేయగా, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *