రేణిగుంట, మే 12:
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని తిరుపతి జిల్లా ఈగిల్ టీమ్, సీఐ జయచంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ‘ఈగిల్’ ఆధ్వర్యంలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ.. సమాజానికి శాపంగా మారిన గంజాయిని నిర్మూలించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థులు, యువత సరదా కోసం అలవాటు చేసుకునే వ్యసనాలు వారి జీవితాలను చీకటిమయం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రవాణా చేసినా, విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 1907 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.సమాజం నుండి గంజాయిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఈగిల్ టీమ్ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు మరియు స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. “డ్రగ్స్ వద్దు.. బ్రో” అంటూ రాసి ఉన్న ప్లకార్డులతో అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *