ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన
రేణిగుంట: రేణిగుంట మండల వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు గాజుల మండ్యం గ్రామంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ఎస్ ఏ ఏ ఎన్ ఎస్ (సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్స్ టూ నేనుట్రాలీజ్ పనేమోని సక్సెస్ఫులీ ) కార్యక్రమంపై ప్రత్యేక ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కామరాజు గర్భిణులు, బాలింతలు, వారి సహాయకులకు ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, ముఖ్యంగా న్యుమోనియా నివారణ, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
అలాగే ప్రస్తుత శీతాకాల వాతావరణ పరిస్థితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురికాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు. చిన్నారులకు చల్లగాలి తగలకుండా తగిన వెచ్చని దుస్తులు ధరింపజేయడం, పరిశుభ్రత పాటించడం, పౌష్టికాహారం అందించడం, సమయానికి టీకాలు వేయించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
పిల్లల్లో వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీ లోపలికి లాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
వృద్ధులు కూడా చలికాలంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలని తెలిపారు. తల్లులు, కుటుంబ సభ్యులు చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని హెల్త్ సూపర్వైజర్ కామరాజు సూచించారు.
ఆరోగ్యవంతమైన బాల్యం – న్యుమోనియా రహిత సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఎన్ఎం సుభాషిణి, ఆశాకార్యకర్తలు ఛాముండేశ్వరి,శిరీష, సరోజిని,చంటి పిల్లల తల్లి తండ్రులు,గ్రామస్తులు పాల్గొన్నారు.


