​11,661 ఓట్లకు గానూ 6,527 ఓట్ల పోలింగ్.. 3,870 ఓట్ల భారీ మెజార్టీతో రికార్డు విజయం..

​మంచం గుర్తుపై పోటీ చేసి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం..

ఆర్వో అధికారిక ధ్రువీకరణ…

​విజయం వెనుక మహబూబ్ బాషా రాజకీయ సమన్వయం..

ఫోన్ చేసి అభినందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి…

​పెద్దల సహకారంతో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: నూతన సర్పంచ్ చిత్ర..

​రేణిగుంట (తిరుపతి జిల్లా): స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా రేణిగుంట పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగిన పోరులో తెలుగుదేశం – కూటమి బలపరిచిన అభ్యర్థి, డి.పి. విశ్వనాథం కోడలు జె. చిత్ర అఖండ విజయం సాధించారు. మంచం గుర్తుపై బరిలోకి దిగిన ఆమె, తన సమీప ప్రత్యర్థులపై ఏకంగా 3,870 ఓట్ల భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. రేణిగుంట పంచాయతీలో మొత్తం 11,661 ఓట్లకు గానూ 6,527 ఓట్లు పోలవగా, జె. చిత్ర స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆమె గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ధ్రువీకరించారు.
​విజయం వెనుక మహబూబ్ బాషా సమన్వయం.. ఎమ్మెల్యే అభినందనలు
ఈ చారిత్రాత్మక విజయం వెనుక రేణిగుంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహబూబ్ బాషా రాజకీయ సమన్వయం, ప్రచార వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడం, ఇంటింటి ప్రచారంలో శ్రేణులను ముందుండి నడిపించడంలో ఆయన కృషి ఎనలేనిదని పార్టీ వర్గాలు కొనియాడాయి. ఈ భారీ విజయంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేకంగా స్పందించి, మహబూబ్ బాషాకు ఫోన్ చేసి అభినందించడంతో పాటు నూతన సర్పంచ్ జె. చిత్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆశీర్వాదాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఈ ప్రచండ విజయాన్ని అందించారని హర్షం వ్యక్తం చేశారు.
​అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా: సర్పంచ్ జె. చిత్ర
తన విజయానంతరం జె. చిత్ర మాట్లాడుతూ, తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, జనసేన యువ నాయకుడు మిధున శాలి, బీజేపీ నాయకులు బి.డి. బాలాజీ మరియు కూటమి నాయకులు, యువ నాయకులకు, కార్యకర్తలకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దల సహాయ సహకారాలతో రేణిగుంట పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇంతటి భారీ మెజార్టీతో గెలిపించిన రేణిగుంట ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు.
​ఇది ప్రజలిచ్చిన అఖండ విజయం: డి.పి. విశ్వనాథం
డి.పి. విశ్వనాథం మాట్లాడుతూ, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆశీస్సులు, కూటమి నాయకుల సమష్టి కృషి వల్లే నేడు తమ కోడలు జయచిత్ర రికార్డు మెజార్టీతో గెలుపొందారని అన్నారు. రేణిగుంట చరిత్రలో ఇంతటి మెజార్టీ రావడం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని, ఇది ప్రజలిచ్చిన అఖండ విజయమని అభివర్ణించారు.
​పట్టణమంతా విజయోత్సవాల సందడి
ఫలితాలు వెలువడిన వెంటనే రేణిగుంట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ, జై తెలుగుదేశం నినాదాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. రేణిగుంటలో నమోదైన ఈ భారీ మెజార్టీ స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *