సింగరాయకొండ: ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చల్లాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ సెంటర్ నుంచి బస్ స్టేషన్ వరకు సాగిన ఈ ర్యాలీని సింగరాయకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి ప్రారంభించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు డాక్టర్ అర్రిబోయిన రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ అమల్ రాజ్ చల్లా మాట్లాడుతూ మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ ఆహార నియమాలు పాటించాలని తెలిపారు. సాధారణ ప్రజలు మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు సమతుల ఆహారం తీసుకోవడం, అధిక చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ముందస్తు పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలితో మధుమేహం వల్ల కలిగే అనేక సమస్యలను నివారించవచ్చని వివరించారు.
డాక్టర్ ఓగుబోయిన నితీష్ కూడా మధుమేహ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.
ర్యాలీలో పాల్గొన్నవారు మధుమేహ నివారణకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల పరిషత్ అధ్యక్షులు చీమకుర్తి కృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు కూనపురెడ్డి హైమావతి, సుబ్బారావు, ఉపాధ్యాయులు కొల్లూరు మస్తానయ్య, అంబటి ప్రసాదరావు, జాయ్ జోసెఫ్, ఆలా రామకృష్ణ, న్యాయవాదులు కొల్లూరు వెంకట్ నరసింహారావు, పంతగాని వెంకటేశ్వర్లు, పులి వీరప్రసాద్, మాలకొండయ్య, చీమకుర్తి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ప్రజల్లో మధుమేహ వ్యాధిపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా చల్లాస్ హాస్పిటల్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *