జిల్లా వ్యాప్తంగా 2,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత – సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.

తిరుపతి, అక్టోబర్ 31: తిరుపతి నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో నవంబర్ 1న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఉదయం స్థానిక ఎస్ వి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణతో కలిసి పరిశీలించిన కలెక్టర్, పోలింగ్ పార్టీలకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ తీరును సమీక్షించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు కల్పించినట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటరు స్లిప్పులో పేర్కొన్న పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 90 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, వృద్ధులు, మహిళా ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు క్యూ నిర్వహణకు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, ప్రత్యామ్నాయంగా వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లను నియమించి ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా సంబంధిత మున్సిపల్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేసినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *