శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట పట్టణం వినాయక్ నగర్‌లో ఈరోజు నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
రేణిగుంట 3వ సెగ్మెంట్ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పవిత్ర రాజ్ కుమార్ , బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి జీపాళెం తేజోవతి కి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వినాయక్ నగర్‌లోని ప్రతి వీధిలో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలుసుకుని, వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రాంత అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, స్త్రీశక్తి వంటి సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు.
విద్యార్థులకు ఆర్థిక సహాయం, రైతులకు పెట్టుబడి మద్దతు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించే కార్యక్రమాల గురించి తెలియజేశారు.
అదేవిధంగా రేణిగుంట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా పనిచేయడం స్థానిక సంస్థల ప్రధాన బాధ్యత అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వినాయక్ నగర్ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రజల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించి, స్థానిక అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని కూటమి నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


