• జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్.
  • నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.
  • ఎన్నికల వ్యయ పరిధిలోకి చెల్లింపు ప్రచారాలు, ప్రాయోజిత పోస్టులు.
  • అభ్యర్థుల ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి.

తిరుపతి, అక్టోబరు 26:

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే పోస్టులు, చిత్రాలు, వీడియోలు, లఘు చిత్రాల విషయంలో కంటెంట్ క్రియేటర్లు, సామాజిక మాధ్యమాల ఇన్ ఫ్లూయన్సర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు.

ఈ సందర్భంగా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా, కులాలు, మతాలు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లేదా అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎలాంటి ప్రచార సామగ్రిని రూపొందించవద్దని స్పష్టం చేశారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వెలువడే ప్రచార అంశాలపై ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల తరఫున సామాజిక మాధ్యమాల్లో నిర్వహించే చెల్లింపు ప్రచారాలు, ప్రాయోజిత పోస్టులు, ప్రచార ఒప్పందాల ద్వారా చేసే కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు అభ్యర్థుల ఎన్నికల వ్యయంలోకి వస్తాయని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించే వారికి చెల్లించే రుసుములను ఎన్నికల వ్యయ పరిశీలనలో భాగంగా నమోదు చేస్తామని, సంబంధిత వివరాలను ఎన్నికల అధికారులకు పారదర్శకంగా వెల్లడించాలని సూచించారు.

అభ్యర్థులకు సంబంధించిన ప్రచార ప్రకటనలు, వీడియోలు తదితర ఎన్నికల ప్రచార సామగ్రిని సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే ముందు నిబంధనల ప్రకారం జిల్లా స్థాయి మీడియా ధ్రువీకరణ, కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన పర్యవేక్షణ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు అనుమతి పొందాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ పరిణామాలకు తావులేకుండా బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *