*జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.ఎస్. వెంకటేశ్వర్*
నామినేషన్ల స్వీకరణ, పరిశీలనలో అప్రమత్తంగా వ్యవహరించాలి:
*జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు*
తిరుపతి, అక్టోబర్ 19: స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు , సహాయ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి, విధులను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సూచించారు.
సోమవారం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు,జిల్లా జెడ్పీ సీఈఓ శోభన్ బాబు లతో కలసి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల పుస్తకాన్ని పూర్తిగా, శ్రద్ధగా చదివి, అందులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ వంటి అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సందేహాలు తలెత్తినా ఉన్నతాధికారులను సంప్రదించి స్పష్టత పొందాలని, నిబంధనలపై అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. తమ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణతో పాటు ఎన్నికల ప్రక్రియలోని ముఖ్యమైన ఘట్టాలను నిబంధనల ప్రకారం వీడియో గ్రాఫీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను నిర్దేశిత నిబంధనలు, గడువులకు అనుగుణంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నామినేషన్ పత్రాల స్వీకరణ, రిజర్వుడ్ స్థానాల అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, ఫారమ్-బి సమర్పణ, అఫిడవిట్లు, డిపాజిట్లు, ఓటరు అర్హతల పరిశీలనలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. నామినేషన్ కేంద్రంలో అభ్యర్థి, ప్రతిపాదకుడు, మరో వ్యక్తికి మాత్రమే అనుమతి ఉండే నిబంధనను పాటించాలని, రిజర్వుడ్ స్థానాల అభ్యర్థుల కుల ధృవీకరణ పత్రాలు, డిక్లరేషన్లను నిబంధనల ప్రకారం పరిశీలించాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఫారమ్-బి ని నిర్దేశిత గడువులోపు సమర్పించేలా చూడాలని, నామినేషన్ల పరిశీలన రోజున సాయంత్రం 5 గంటలలోపు సమర్పణకు సంబంధించిన నిబంధనలను అనుసరించాలని సూచించారు.
నామినేషన్ పత్రాలపై వరుస సంఖ్య, తేదీ, సమయం నమోదు చేసి రసీదు ఇవ్వాలని, అనుబంధ పత్రాలను చెక్లిస్ట్తో పరిశీలించి రికార్డులను క్రమబద్ధంగా భద్రపరచాలని తెలిపారు. అఫిడవిట్లలో అన్ని వివరాలు నమోదు చేయించడం, క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలు పరిశీలించడం, నిర్దేశిత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపును నిర్ధారించడం అవసరమన్నారు. అభ్యర్థి, ప్రతిపాదకుల ఓటరు అర్హతలను సంబంధిత ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల నిబంధనల ప్రకారం పరిశీలించాలని, చిన్నపాటి అక్షర లేదా ముద్రణ దోషాల కారణంగా నామినేషన్లను తిరస్కరించకుండా నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల విషయంలో పోటీ, ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలను స్పష్టంగా పాటించాలని తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల అమలు, రికార్డుల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, నామినేషన్ల స్వీకరణ నుంచి ఉపసంహరణ వరకు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.


