రేణిగుంట, అక్టోబర్ 16
క్రీడలు యువత శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో అవసరం: తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడిని అధిగమించడానికి,శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తిరుపతి – చెన్నై జాతీయ రహదారి సమీపంలోని తూకివాకం గ్రామంలో నూతనంగా నిర్మించిన ‘చెంచు క్రికెట్ క్లబ్ మైదానాన్ని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి శుక్రవారం ఉదయం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
మారుతున్న కాలంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతోందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల సరిహద్దుల్లో ఇలాంటి అత్యాధునిక బాక్స్ క్రికెట్ సదుపాయాలు రావడం అభినందనీయమని అన్నారు.
ఉద్యోగులు, విద్యార్థులు తమ బిజీ షెడ్యూల్లో రోజుకు కొంత సమయం క్రీడలకు కేటాయించడం ద్వారా రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చని తెలిపారు.
గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని, నాయకత్వ లక్షణాలను, సమష్టి కృషితో పనిచేసే తత్వాన్ని ఆటలు మాత్రమే నేర్పిస్తాయని చెప్పారు.
క్రీడలు యువతను సన్మార్గంలో నడిపిస్తాయని, చెడు వ్యసనాలు, మొబైల్ గేమింగ్లకు బానిసలు కాకుండా మైదానంలో చెమటోడ్చి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని యువతకు హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్. రవి, కూటమి పార్టీల ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా ప్రముఖులు మరియు క్రీడాకారులు,యువత తదితరులు పాల్గొన్నారు.


