స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నాయకులపై దాడులను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే.
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పుంగనూరు, రాయచోటి, తిరుపతి తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, అభ్యర్థులపై జరుగుతున్న దాడులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ హింస, దాడులకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
తాడేపల్లి ఆదేశాలతోనే అల్లర్లు: ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక, తాడేపల్లి నుంచి అందుతున్న ఆదేశాలతో వైఎస్సార్సీపీ ముఠాలు అల్లర్లకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
పొరుగు ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
టీడీపీ నాయకులపై దాడులు హేయం:
విపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడం, అభ్యర్థులపై భౌతిక దాడులకు దిగడం, అధికారులను బెదిరించి అక్రమ ఏకగ్రీవాలకు ప్రయత్నించడం వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఓటమి భయంతోనే హింస:
ప్రజల మద్దతుతో సంక్షేమం, అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి దాడులు, బెదిరింపుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వైసీపీ, ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
శ్రీకాళహస్తిలో హింసాత్మక రాజకీయాలకు తావులేదు:
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలన్నదే తమ లక్ష్యమని సుధీర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు, బెదిరింపుల తరహా ఘటనలు శ్రీకాళహస్తిలో చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఏ పార్టీకి చెందిన వారైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.
అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి:
ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ వరకు ప్రతి దశలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్థుల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దాడులకు పాల్పడే వారిపై ఫిర్యాదుల ఆధారంగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని, ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.
ప్రజాస్వామ్యమే మా మార్గం:
తెలుగుదేశం పార్టీ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటోందని, ప్రజల తీర్పును గౌరవించడమే ప్రజాస్వామ్యానికి అసలైన నిదర్శనమని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు ఉపాధి అవకాశాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందుతున్న కూటమి ప్రభుత్వానికి హింసాత్మక రాజకీయాలతో పనిలేదని స్పష్టం చేశారు.
గత అరాచకాలకు ప్రజలు మర్చిపోలేదు:
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు.
మరోసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఎన్నికల యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
“ఇది గత ఐదేళ్ల అరాచక పాలన కాదు.. చట్టబద్ధంగా, రాజ్యాంగ విలువలకు కట్టుబడి నడుస్తున్న ప్రజా ప్రభుత్వం.
ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకోవడం వైసీపీ భ్రమ మాత్రమే. శ్రీకాళహస్తిలో రౌడీయిజానికి, బెదిరింపులకు, హింసాత్మక రాజకీయాలకు తావులేదు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి.. ప్రజలే తమ ఓటుతో సరైన తీర్పు ఇవ్వాలి” అని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

