సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ మానసా దేవి అమ్మవారు – భక్తిశ్రద్ధలతో పూజలు*

వరికుంటపాడు, అక్టోబర్ 16, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.

వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మానసా దేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం నాడు అమ్మవారిని సరస్వతీ దేవి అలంకారంలో సర్వాంగ సుందరంగా, విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెల్లని వస్త్రాలతో, వీణా పాణియై, విద్యా ప్రదాయినిగా దర్శనమిస్తున్న అమ్మవారిని చూసి భక్తులు పరవశించారు.ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, సహస్రనామ పూజలు జరిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను ఘనంగా పంపిణీ చేశారు.సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు తూర్పు రొంపిదొడ్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, చదువుల తల్లి సరస్వతి అనుగ్రహంతో విద్యార్థులు విజ్ఞానవంతులు కావాలని, ప్రజలందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రార్థించారు.శరన్నవరాత్రి ఉత్సవాలతో తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *