శ్రామిక వ్యవస్థలో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం.. క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన సేవలే లక్ష్యం!.
తిరుపతి, అక్టోబర్ : తిరుపతిలోని ప్రభుత్వ యూత్ హాస్టల్లో స్మార్ట్ శ్రామిక్ మిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రామిక వ్యవస్థను ఆధునికీకరించడం, క్షేత్రస్థాయిలో సేవలను మరింత సమర్థవంతంగా అందించడం, డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఈ శిక్షణా తరగతులను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు జిల్లాల నుంచి వివిధ మండలాలకు చెందిన మండల స్థానిక మిత్రాలు, డివిజనల్ మిషన్ కోఆర్డినేటర్లు హాజరై శిక్షణలో చురుగ్గా పాల్గొన్నారు.
డిజిటల్ పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ
శిక్షణా కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, డిజిటల్ సాంకేతికత వినియోగం, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎదురయ్యే శ్రామిక సంబంధిత సమస్యలను గుర్తించి, వాటికి తగిన పరిష్కారాలు చూపే అంశాలపై వివరంగా చర్చించారు.
అలాగే డివిజనల్ మిషన్ కోఆర్డినేటర్లు, మండల స్థానిక మిత్రుల మధ్య సమన్వయం పెంపొందించడం, విధుల నిర్వహణలో పారదర్శకత పాటించడం, క్షేత్రస్థాయిలో మిషన్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన అమలుకు పిలుపు
ఈ శిక్షణా కార్యక్రమాన్ని స్మార్ట్ శ్రామిక్ మిషన్ చీఫ్ మిషన్ డైరెక్టర్ పి. శ్రీనివాసరావు, మిషన్ డైరెక్టర్ నైమిషా, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీరామ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హరి , RM , గణేష్, ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, విధుల నిర్వహణలో ఉపయోగపడే విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తమ తమ ప్రాంతాల్లో అమలు చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని నిర్వాహకులు సూచించారు.
స్మార్ట్ శ్రామిక్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయం, సమర్థవంతమైన కార్యాచరణతో క్షేత్రస్థాయి సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ శిక్షణా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.


