సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి

జలదంకి, అక్టోబర్ 08, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.

గర్భిణీలు బాలింతలకు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, వారు సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వింజమూరు సెక్టార్ ఐసిడిఎస్ సిడిపిఓ పద్మజాకుమారి పేర్కొన్నారు. గురువారం మండలంలోని జమ్మలపాలెం న్యూ ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త జె మౌనిక ఆధ్వర్యంలో తొమ్మిదవ రాష్ట్రీయ పోషణ్ మహోత్సవ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిపిఓ పద్మజాకుమారి, సూపర్వైజర్ సుహాసిని, ఎంఈఓ లు పద్మనాభం, నాగేశ్వరరావు, పీహెచ్ సీ వైద్యాధికారిణి లక్ష్మి లు హాజరయ్యారు. సిడిపిఓ పద్మజాకుమారి మాట్లాడుతూ మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్న జాతీయ పోషణ్ మాసోత్సవాల లక్ష్యం సమాజంలో పోషకాహార లోపం అనేది లేకుండా చేయడమే అన్నారు. మన అంగన్వాడి – మన బాధ్యత నినాదంతో గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యం గా ఉంటుందన్నారు. గర్భం దాల్చినప్పటి నుండి తల్లులు సమతుల్యమైన ప్రోటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తులను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలన్నారు. పోషకాహారం లోపిస్తే పిల్లల మానసిక, శారీరక మేధో వికాసం దెబ్బతింటుందన్నారు. కావున పిల్లలకు తాజా కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, పాలు క్రమం తప్పకుండా అందించాలన్నారు. పి హెచ్ సి వైద్యాధికారిణి లక్ష్మీ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎంఈఓ లు పద్మనాభం, నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించాలన్న, వారిలో మేధోశక్తి పెరగాలన్న సరైన పోషకాహారం అవసరమన్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు రుచికరమైన, బలవర్ధకమైన వేడి భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జమలపాలెం మాజీ సర్పంచ్ బుర్రి శ్రీవేణి అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పి జయలక్ష్మి, సిహెచ్ ఓ ప్రసన్న, మెడికల్ సూపర్వైజర్ కృష్ణవేణి, ఏఎన్ఎం లలిత, జి ఎం ఎస్ కే కోటేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *