కలిగిరి, సెప్టెంబర్ 28 (మన ద్యాస ప్రతినిధి నాగరాజు):
కలిగిరి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ పాలూరి మాల్యాద్రి రెడ్డి ఐదు సంవత్సరాల పదవీ కాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా కలిగిరి మండల కేంద్రంలో ఆదివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను పూలమాలలు, శాలువాలతో అత్యంత వైభవంగా సత్కరించారు. అనంతరం నాయకులు, అభిమానుల మధ్య ఆయనతో కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు.గడిచిన ఐదేళ్ల కాలంలో కలిగిరి మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మాల్యాద్రి రెడ్డి చేసిన కృషిని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ బలోపేతానికి మరియు మండల ప్రగతికి ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.సన్మాన గ్రహీత పాలూరి మాల్యాద్రి రెడ్డి మాట్లాడుతూ తన ఐదేళ్ల పదవీ కాలంలో మండల ప్రజలు, వైసీపీ శ్రేణులు, నాయకులు అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదని భావోద్వేగంతో తెలిపారు. పదవి ఉన్నా లేకపోయినా కలిగిరి మండల ప్రజల సేవలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో ఎల్లప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానానికి, నిరంతరం మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రముఖ నాయకులు మాల్యాద్రి గౌడ్, పుల్లా వేమయ్య, కుట్టుబోయిన పవన్, పుల్లా రవి, గోసాల ప్రసన్న, రాజశేఖర్, పంది మనోహర్, గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు.
