వరికుంటపాడు, సెప్టెంబర్ 28 (మన న్యూస్ ప్రతినిధి నాగరాజు):
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ FCI డైరెక్టర్ రైతు నరేంద్ర ఆదివారం వరికుంటపాడు మండలం రామాపురం జాతీయ రహదారికి ఆనుకొని కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.స్వామివారి దర్శనానంతరం ఆలయ ధర్మకర్తలు సూర్యనారాయణ దంపతులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువా, జ్ఞాపికతో నరేంద్రను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ రామాపురం ప్రాంతంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని కొనియాడారు. ధర్మకర్తలు సూర్యనారాయణ దంపతులు ఆలయ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, స్థానిక భక్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.