ఒకే రోజు 5 సాధారణ ప్రసవాలు.. ప్రభుత్వ వైద్య సేవల సత్తా చాటిన రాపూరు ఆసుపత్రి,,
తల్లీబిడ్డలు క్షేమం.. వైద్యుల సేవలకు ప్రజల ప్రశంసల జల్లులు…
గత నెలలో 23 ప్రసవాలు.. ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న విశ్వాసం,,,
రాపూరు, సెప్టెంబర్ 7, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో లేవనే అపోహలను చెరిపేస్తూ రాపూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) మరోసారి తన సత్తాను నిరూపించింది. ఆదివారం ఒక్క రోజులోనే ఐదు సాధారణ ప్రసవాలను విజయవంతంగా నిర్వహించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని వైద్య సేవలతో రాపూరు సీహెచ్‌సీ ఇప్పుడు జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు, అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బంది సమన్వయంతో ఈ ఐదు ప్రసవాలు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విజయవంతంగా పూర్తయ్యాయి. ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ దేదీప్య నేతృత్వంలో జరిగిన ఈ వైద్య సేవలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రసవించిన తల్లులు, నవజాత శిశువులు అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇటీవల కాలంలో అధిక ఖర్చులతో ప్రైవేట్ ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్న ప్రజలకు రాపూరు సీహెచ్‌సీ ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. గత నెలలోనే 23 ప్రసవాలను విజయవంతంగా నిర్వహించడం ఈ ఆసుపత్రిపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా సీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్షియా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత గర్భిణీలకు సురక్షితమైన, నాణ్యమైన ప్రసూతి సేవలను ఉచితంగా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నందున గర్భిణీలు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయకుండా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాపూరు సీహెచ్‌సీ సాధించిన ఈ ఘనతతో ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
