జాతీయ జెండాను ఆవిష్కరించిన స్వాతంత్ర్య దినోత్సవం నాడు జన్మించిన వనజమ్మ..

విద్యార్థులకు మిఠాయిల పంపిణీ.. వనజమ్మకు ఘన సన్మానం..

రేణిగుంట, ఆగస్టు 15.
దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుతూ పట్టణంలోని రెయిన్బో గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమక్షంలో నిర్వహించిన వేడుకలు దేశభక్తి నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహభరితంగా సాగాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే జన్మించిన వనజమ్మ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపజేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు సమష్టిగా జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. చిన్నారులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ సందడి చేశారు. విద్యార్థులకు స్వాతంత్ర్యం విలువ, సమరయోధుల త్యాగాలు, దేశ అభివృద్ధిలో యువత పాత్రపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రెయిన్బో గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ కరస్పాండెంట్‌ అథావుల ఖాన్ వనజమ్మను ఘనంగా సత్కరించి, శాలువాతో సన్మానించి మెమొంటో అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించిన ఆమె చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనేది ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని, వారి త్యాగాలను ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. నేటి విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాణకర్తలని, విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. స్వాతంత్ర్యం మనకు లభించిన హక్కు మాత్రమే కాదని, దాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తూనే వారిలో దేశభక్తి, మానవతా విలువలు, సేవాభావాన్ని పెంపొందించేందుకు పాఠశాల తరఫున నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *